అందాల నటుడు శోభన్‌బాబు కుమారుడిని మీరు ఎప్పుడైనా చూశారా?

తెలుగు ఇండస్ట్రీలో అందాల నటుడు అంటే ఎవరికైనా శోభన్‌బాబు గుర్తుకు రావాల్సిందే. శోభన్ బాబు అసలు పేరు శోభనా చలపతిరావు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆయన శోభన్‌బాబుగా తన పేరును మార్చుకున్నారు. ఆయన 1937లో జనవరి 14న జన్మించారు. ఎన్నో కుటుంబ కథా చిత్రాల్లో శోభన్‌బాబు నటించడం వల్ల ఆయన ఫ్యామిలీ హీరోగా పేరు పొందారు. మరోవైపు శోభన్‌బాబు రింగ్ అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్‌గానూ నిలిచింది. శోభన్‌‌బాబు తన అందంతోనే కాకుండా అద్భుతమైన నటనతో, వ్యక్తిత్వంతో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. అందుకే ఆయన్ను సోగ్గాడు అని పిలిచేవారు. నిజం చెప్పాలంటే ఇప్పటికీ శోభన్‌బాబు సినిమాలు చూస్తే మనం ఆయనకు ఫ్యాన్ అయిపోతాం. అంతేకాకుండా ఒకప్పుడు తెలుగు హీరోల్లో శోభన్‌బాబు అంటే సంపన్న హీరోగా పరిగణించేవారు. శోభన్ బాబు తన 30 ఏళ్ల కెరీర్‌లో మొత్తం 228 సినిమాల్లో యాక్ట్ చేశారు. 1996లో రిలీజైన ‘హలోగురు’సినిమాతో నటనకు ఫుల్ స్టాప్ పెట్టారు. 2008లో శోభన్‌బాబు ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు.

కాగా శోభన్‌బాబు ఫ్యామిలీ గురించి చాలామందికి తెలియదు. శోభన్‌బాబుకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి ఉన్నారు. అయినా తన పిల్లలను సినిమాల్లోకి తీసుకురావాలని శోభన్‌బాబు ఎప్పుడూ ప్రయత్నించలేదు. శోభన్‌బాబు సినిమాల్లో నటించే సమయంలో కూడా కనీసం పిల్లలను షూటింగులకు తీసుకువెళ్లేవారు కాదు. అసలు సినిమాలే వద్దు అని నలుగురి పిల్లలను మంచిగా చదివించారు. అలా తనకు ఉన్న ఒక కుమారుడిని డాక్టర్ చదివించారు. శోభన్‌బాబు కుమారుడి పేరు కరుణ శేషు. డాక్టర్‌గా కరుణ శేషు మంచి వైద్యం చేస్తూ వ్యక్తిత్వం విషయంలో తండ్రి బాటలోనే నడుస్తున్నాడు. ఇటీవల చెన్నైలో కరుణ శేషును కలిసిన శోభన్ బాబు అభిమానులు చాలా సేపు ముచ్చటించారు. రాజమండ్రిలో శోభన్‌బాబు విగ్రహాన్ని తాము ఏర్పాటు చేశామని, ఆవిష్కరణ కార్యక్రమానికి రావాలని ఆయన్ను ఆహ్వానించారు. అటు శోభన్‌బాబు పేరుతో ఎంతో మంచి కార్యక్రమాలు చేపడుతున్నందుకు అభిమానులను కరుణశేషు అభినందించారు. కాగా శోభన్ బాబు ఆర్థికంగా చాలా తెలివి ఉన్న వ్యక్తి. పైసాను ఎక్కడ పెట్టుబడి పెట్టాలో బాగా తెలిసిన వ్యక్తి. అప్పట్లోనే ఎక్కువగా భూములు కొనుగోలు చేసి తన పిల్లలకు కావాల్సినంత ఆస్తిని ఇచ్చారు. శోభన్ బాబుకు మనవడు కూడా ఉన్నాడు. ఆయన మనవడు కూడా చాలా అందంగా.. అచ్చం శోభన్ బాబులా ఉంటాడు కానీ శోభన్ బాబు పేరు చెప్పుకుని ఆయన కూడా సినిమాల్లోకి రాలేదు.