అక్కినేని నాగచైతన్యతో విడాకుల వార్తలు.. అసలు సమంత ఏమంటోంది?

టాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ కపుల్ ఎవరైనా ఉన్నారంటే అది అక్కినేని కుటుంబానికి చెందిన నాగచైతన్య-సమంత జోడీనే. ఇద్దరూ స్టార్లుగా ఉన్నప్పుడే ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. దీంతో వీరి క్రేజ్ మరింత పెరిగింది. పెళ్లి తర్వాత కూడా వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో నటించగా అవి బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. అయితే ప్రస్తుతం వీరిద్దరూ విడాకులు తీసుకోనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. భర్త చైతూతో సమంతకు విభేదాలు వచ్చాయని, అందుకే సమంత విడాకులు ఇవ్వనుందని కుప్పలు తెప్పలుగా వార్తలు కనిపిస్తున్నాయి. దీనికి పలు కారణాలను విశ్లేషకులు వేలెత్తి చూపిస్తున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత.. ఇటీవల తన సోషల్ మీడియా అకౌంట్లకు పేరు మార్చేసింది. గతంలో సమంత అక్కినేని అని ఉన్ప పేరును మార్చి కేవలం ఇంగ్లీష్ లెటర్ ‘S’ అని పెట్టుకుంది. ఎస్ అంటే సమంత అని మనం ఊహించవచ్చు. మరి పేరులో అక్కినేనిని ఎందుకు తీసేసిందో ఎవరికీ అర్ధం కాలేదు.

మరోవైపు ఆగస్టు 29న కింగ్ నాగార్జున పుట్టినరోజు. ఆ రోజు అక్కినేని ఫ్యామిలీలో పండగ రోజు అన్నమాటే. దీంతో అక్కినేని నాగార్జునకు కుటుంబ సభ్యులందరూ కలిసి విషెస్ తెలిపి ఆయనతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలలో అక్కినేని అమలతో పాటు కుమారులు అక్కినేని నాగచైతన్య, అఖిల్‌తో పాటు పలువురు కనిపించారు. కానీ అక్కినేని వారి కోడలు సమంత ఈ ఫోటోలలో కనిపించలేదు. దీంతో పలువురు కావాలనే మామ బర్త్‌డే ఫంక్షన్‌కు సమంత హాజరుకాలేదని, నాగచైతన్యతో విభేదాలే ఆమె హాజరుకాకపోవడానికి కారణమంటూ పలు కథనాలను మీడియా వండి వార్చింది. అయితే సమంత రాకపోవడానికి అసలు కారణం ప్రస్తుతం తమిళ సినిమా షూటింగ్‌లో భాగంగా తమిళనాడులో ఉందని… అందుకే మామ నాగార్జున బర్త్ డేకి సమంత హాజరు కాలేదని కొందరు వాదిస్తున్నారు. కానీ నాగార్జున పుట్టినరోజు నాడు ట్విట్టర్ వేదికగా మామకు కోడలు శుభాకాంక్షలు తెలిపింది.‘మీపై నాకున్న గౌరవం గురించి చెప్పడానికి పదాలు సరిపోవు. ఎప్పుడూ అందంగా, ఆరోగ్యంగా ఉండాలని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్‌డే మామ’ అంటూ అందులో పేర్కొంది. దీంతో సమంత నాగ్‌ను మామ అని సంబోధించడంతో చైతూతో విడాకుల రూమర్లకు ఇప్పటికైనా తెరపడుతుందేమో చూడాలి.