అభిమానులకు మస్త్ మజా ఇస్తున్న భీమ్లానాయక్ మూవీ టైటిల్ సాంగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన బర్త్ డే సందర్భంగా తన అభిమానులకు తొలి కానుక ఇచ్చేశారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా నుంచి టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. హీరో రానా ఈ పాటను సోషల్ మీడియాలో స్వయంగా విడుదల చేసి పవన్‌కు బర్త్ డే విషెస్ తెలిపాడు. ఈ పాట మాస్ ప్రేక్ష‌కుల‌కు మాంచి కిక్కిచ్చేలా ఉంది. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం, తమ‌న్ సంగీతం అద్భుతంగా ఉన్నాయి. గాయకులు శ్రీ కృష్ణ‌, పృథ్వీ చంద్ర‌, రామ్ మిర్యాలా కలిసి ఆలపించిన ఈ పాట పవన్ అభిమానులకు మస్త్ మజా ఇస్తుందనే చెప్పాలి. ప‌వ‌న్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుద‌లైన ఈ టైటిల్ సాంగ్ రికార్డులు బ‌ద్ద‌లు కొట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ పాటలో హీరోయిజంను ఆకాశానికి ఎత్తుతూ లిరిక్స్ ఉన్నాయి. ఈ పాట కోసం పిక్చరైజ్ చేసిన కవర్ సాంగ్ బాగుంది. అడవుల బ్యాక్ డ్రాప్‌లో కవర్ సాంగ్ చిత్రీకరించడం వల్ల పాటకు మరింత అందం వచ్చింది.

మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుయ్ కోషియుమ్‌కు ‘భీమ్లా నాయక్’ రీమేక్‌గా తెరకెక్కుతోంది. పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్, రానా సరసన ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు. ఒరిజినల్ మూవీ అయ్యప్పనుయ్ కోషియుమ్‌లో బిజూ మీనన్ నటించిన క్యారెక్టర్ అది. కోషి కురియన్‌గా కనిపించిన పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో రానా నటిస్తోన్నారు. రీమేక్‌లో పవన్ కల్యాణ్ క్యారెక్టర్ పేరు భీమ్లా నాయక్. ఆయన ధరించిన ఎస్ఐ గెటప్‌పైనా ఈ నేమ్‌బ్యాడ్జ్ కనిపిస్తుంది. సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12 భీమ్లానాయక్ ప్రేక్షకుల ముందుకు రానుంది.