ఆర్.నారాయణమూర్తికి ఓ లవ్‌స్టోరీ ఉందని మీకు తెలుసా?

టాలీవుడ్‌లో ఉద్యమ సినిమాలు అంటే అందరికీ ముందుగా గుర్తుకువచ్చేది ఆర్.నారాయణమూర్తి. విప్లవకారుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో ఆయన నటించారు. కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న ఆయన సినిమాల ద్వారా ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్నారు. దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా ఆర్.నారాయణమూర్తి మంచి పేరు తెచ్చుకున్నారు. ఎర్రసైన్యం, చీమలదండు, ఒరేయ్ రిక్షా, వీర తెలంగాణ వంటి సినిమాలతో హిట్లు అందుకున్నారు. 45 ఏళ్లుగా ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నా ఇప్పటికీ పెళ్లి మాత్రం చేసుకోకుండా బ్రహ్మచారిగానే మిగిలిపోయారు. అయితే ఆర్.నారాయణమూర్తి యుక్త వయసులో ఉన్నప్పుడు ఓ అమ్మాయిని ప్రేమించారట. కాకపోతే అది ఫెయిల్యూర్ లవ్‌స్టోరీ. మనసుకు నచ్చిన అమ్మాయిని తాను పెళ్లి చేసుకోవాలని భావించానని, కానీ జీవితం తనకు ఆ అవకాశం ఇవ్వలేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆర్.నారాయణమూర్తి స్వయంగా వెల్లడించారు.

తాను ఓ అమ్మాయిని ప్రేమించగా ఇదే విషయాన్ని అమ్మాయి కుటుంబంతో ఆర్.నారాయణమూర్తి చెప్పారట. కానీ ఆమె వేరే కులానికి చెందిన అమ్మాయి కావడంతో పాటు తాను నటుడిని కావడం వల్ల కుటుంబసభ్యులు తన ప్రేమను అంగీకరించలేదని ఆర్.నారాయణమూర్తి వివరించారు. దీంతో తాను ప్రేమించిన అమ్మాయిని కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదన్నారు. తాను వయసులో ఉన్నప్పుడు సినిమాలపై దృష్టి పెట్టడంతో పెళ్లి అనే మాట తన జీవితంలో దూరమైందన్నారు. అయితే ఇప్పుడు ఆలోచిస్తే.. అప్పుడు తాను ఎందుకు పెళ్లి చేసుకోలేదో అని చాలా బాధ కలుగుతుందన్నారు. మనిషికి వ‌య‌సు పెరుగుతున్నకొద్దీ తప్పనిసరిగా ఒక‌రు తోడుగా ఉండాలని ఆర్.నారాయణమూర్తి సూచించారు. ఒకవేళ అలాంటి తోడు లేకపోతే ఆ జీవితం నరకం అని, యువత ఈ విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలని కోరారు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలని.. లేకపోతే తనలాగా తర్వాత బాధపడాల్సి ఉంటుందని యువతను సున్నితంగా హెచ్చరించారు. అనుభవం ఎన్నో పాఠాలను నేర్పిస్తుందన్న విషయం తాను గ్రహించానని తెలిపారు. కాగా ఎక్కువగా పేదలపై, కులవృత్తులపై సినిమాలు తీస్తూ ఆర్.నారాయణమూర్తి పీపుల్స్ స్టార్ బిరుదును సంపాదించారు.