ఆ క్లాసిక్‌లో నయన్!

సౌత్ ఇండియాలో.. ఉమెన్ సెంట్రిక్ స్టోరీ అనగానే ముందుగా గుర్తొచ్చే హీరోయిన్స్‌ నయనతార, అనుష్క, ఇంకా కీర్తి సురేష్! కానీ, వీరి ముగ్గురిలోనూ లేడీ సూపర్ స్టార్ గా వెలుగుతోంది మాత్రం నయనతార అనే చెప్పాలి. ఫిల్మ్ మేకర్స్ కొత్తగా ఏ ఉమెన్ సెంట్రిక్ స్టోరీ రాసుకున్నా.. వాళ్లలో చాలామంది ఊహించుకునే నటి నయనతారానే అంటే అతిశయోక్తి కాదు. అంతలా లేడీ ఓరియంటెడ్ సినిమాలకి కేరాఫ్ అయిపోయిందామె. ఇప్పటికే చాలా సినిమాల్లో తన టాలెంట్‌ని ప్రూవ్ చేసుకుంది కూడా. అందుకే ఇప్పుడు మరో సూపర్ హిట్ మూవీ రీమేక్ ఆఫర్… ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. అదికూడా ‘‘మాతృదేవోభవ’’ లాంటి సెంటిమెంట్ మూవీ! ఇరవై ఎనిమిదేళ్ల కిందట… మాధవి లీడ్‌ రోల్‌లో.. అజయ్ కుమార్ డైరెక్షన్‌లో కె.ఎస్.రామారావు నిర్మించిన ఈ సినిమా, ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించడమే కాకుండా.. కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడు మళ్లీ ఈ మూవీని అదే డైరెక్టర్‌‌తో రీమేక్ చేసేందుకు రెడీ అయ్యారు.. ప్రొడ్యూసర్‌‌ కె.ఎస్.రామారావు. మరీ, మాతృత్వంలోని గొప్పతనాన్ని కళ్లకు కట్టినట్టు నటించి.. అందరి మనసులను గెలుచుకున్న మాధవి పాత్రను..

ఇప్పుడు ఎవరు పోషిస్తారు? అనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా.. నయనతార, అనుష్క, కీర్తీ సురేష్… ఈ ముగ్గిరిలో ఎవరైనా సరే… సరిగ్గా సరిపోతారు అంటున్నారు. కానీ, తన ఫస్ట్ ఛాయిస్ మాత్రం నయనతారే అంటున్నారు రామారావు. ఆమె కచ్చితంగా ఈ రీమేక్ కి న్యాయం చేస్తుందని ఆయన నమ్ముతున్నారు. ఇది పెద్ద సమస్య కాకపోయినా.. ఇప్పుడు, స్టార్ హీరోయిన్స్ అనగానే వాళ్ల రెమ్యూనరేషన్ గురించి వినగానే కొంచెం కంగారు పుడుతోంది. పైగా ఇలాంటి సినిమాలకు పబ్లిసిటీ విషయంలో ఆర్టిస్టుల సహకారం ఉంటేనే సక్సెస్ కావడం కొంచెం ఈజీ అవుతుంది. అవన్నీ వర్కవుట్ అవుతాయా? లేదా? అనే ఆలోచనలో ఉన్నానని అంటున్నారు రామారావు. రెమ్యూనరేషన్ విషయంలో నయనతార కొంత తగ్గడమో, ప్రొడ్యుసర్ కొంత పెంచడమో జరగొచ్చు! కానీ, ప్రమోషన్స్‌కి దూరంగా ఉండే నయన్.. మరి ఈ క్లాసిక్ కోసమైనా.. తన కండిషన్స్ ని పక్కన పెడుతుందేమో చూడాలి. ఒకవేళ ఆమె ఈ ప్రాజెక్టుకు ఒకే చెప్తే మాత్రం.. ఆమెకు తన కెరీర్‌‌లో నిలిచిపోయే మరో అద్భుతమైన చిత్రం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు!