ప్రజాప్రతినిధిగా ఓ వైపు సేవ చేస్తూనే మరోవైపు తనకు తిండి పెట్టిన వెండితెరను వదలకుండా అభిమానులను ఎంటర్టైనింగ్ చేస్తున్న నటి రోజా సెల్వమణి. ఆమె జబర్దస్త్ కామెడీ షోలో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ పంచ్‌లు వేసి అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంటారు. ఓ రకంగా చెప్పాలంటే జబర్దస్త్ షోకు బీభత్సమైన రేటింగులు రావడానికి రోజా నవ్వే కారణమని చాలామంది భావిస్తుంటారు. అలాంటి ఆమె ఓ షో సందర్భంగా తన వ్యక్తిగత విషయాలు చెప్పి అందరికీ కన్నీళ్లు తెప్పించారు. వినాయక చవితి స్పెషల్‌గా ఈటీవీలో ఊరిలో వినాయకుడు పేరుతో ఓ స్పెషల్ షో చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో మొదటి నుంచి సుధీర్, ఆది, రష్మీ, వర్ష సందడి చేశారు. ప్రోమో చివర్లో మాత్రం రోజా చెప్పే మాటలు విని అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన ప్రేమ తపస్సు సినిమాతో టాలీవుడ్‌కు రోజా ఎంటరయ్యారు. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోలతో నటించిన రోజా తన నటనతో పాటు డ్యాన్స్‌తో ఎంతగానో ఆకట్టుకుంది. చిరంజీవితో సరిసమానంగా డ్యాన్స్ చేయగలదని పేరు తెచ్చుకున్న రోజా కొన్నాళ్లకు సినిమాలు వదిలేసి ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. అయితే తాను 1991లో తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానని, 2002 వరకు అంటే దాదాపు 11ఏళ్లు నటించి సంపాదించిందంతా అప్పులు కట్టడానికే సరిపోయిందంటూ సదరు వీడియోలో రోజా ఎమోషనల్ అయ్యారు. పెళ్లి చేసుకునే ముందు తనకు సమస్యలు వచ్చాయని.. పిల్లలు పుట్టరు అని కూడా చెప్పారని తెలిపారు. కానీ పెళ్లైన ఏడాదికి అన్షు పుట్టిందని.. అందుకే తనకు అన్షు అంటే చాలా ఇష్టం అంటూ రోజా కన్నీరు పెట్టేసుకున్నారు.
దీంతో తమ ముందే కన్నీళ్లు పెట్టుకున్న రోజాను మరో యాంకర్ ఇంద్రజ వెళ్లి గట్టిగా కౌగిలించుకుని ఓదార్చింది. రోజా మాటలకు ఊరిలో వినాయకుడు షోలో ఉన్న ప్రతీ ఒక్కరూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ షోలో రోజా తన కూతురు అన్షు, కుమారుడితో కలిసి పాల్గొన్నారు. మరోవైపు ప్రోమోలో రోజా మాటలు విన్న తర్వాత ఎప్పుడూ నవ్వుతూ కనిపించే రోజా జీవితంలోనూ అన్ని కష్టాలు ఉండేవా అని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కాగా రోజా తన సినీ కెరీర్లో చిరంజీవితో ముఠా మేస్త్రి, ముగ్గురు మోనగాళ్లు, బిగ్‌బాస్, బాలకృష్ణతో బొబ్బిలి సింహం, భైరవద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం, మాతో పెట్టుకోకు, గాండీవం, పెద్దన్నయ్య, నాగార్జునతో రక్షణ, వజ్రం, అన్నమయ్య, వెంకటేష్‌తో పోకిరి రాజా వంటి సినిమాల్లో నటించింది. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి మహిళా రాజకీయ నేతగా పేరుతెచ్చుకున్న ఆమె సెకండ్ ఇన్నింగ్స్‌లో శంభో శివశంభో, మొగుడు, పవిత్ర, గోలీమార్ వంటి సినిమాలతో ఆకట్టుకున్నారు. మరోవైపు బుల్లితెరపై జబర్దస్త్ వంటి కామెడీ షో చేస్తూనే రచ్చబండ, బతుకు జట్కాబండి, రంగస్థలం వంటి కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ పలువురు దంపతుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.