‘నువ్వు నాకు నచ్చావ్’ ఫేం పింకీ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు

విక్టరీ వెంకటేష్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకో రెండు, మూడు దశాబ్దాల వరకు ఈ సినిమాను సినీ లవర్స్ మరిచిపోయే అవకాశమే లేదు. ఇప్పటికీ ఈ మూవీ బుల్లితెరపై ప్రసారమైతే మంచి టీఆర్పీ రేటింగులు వస్తుంటాయి. ఈ మూవీలో నటించిన ప్రతి పాత్ర ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వెంకటేష్, ఆర్తి అగర్వాల్, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్‌ల తర్వాత ఈ సినిమాల్లో అంతటి వెయిటేజీ ఉన్న పాత్ర ‘పింకీ’ పాత్ర. హీరో, హీరోయిన్‌లతో సమానంగా ఈ సినిమాలో ఆమెకు స్క్రీన్ టైమ్ ఉంటుంది. వెంకీ ఐయామ్ పింకీ అంటూ ఆమె చెప్పిన డైలాగులు ప్రేక్షకులను గిలిగింతలు పెట్టించాయి. బ్రహ్మానందంతో రోలర్ కోస్టర్ సీన్ కూడా అభిమానులను కడుపుబ్బా నవ్విస్తుంది.

నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో పింకీ పాత్రను పోషించిన నటి అసలు పేరు సుదీప. ఈ సినిమా తర్వాత ఆమె పేరు సుదీప పింకీగా మారిపోయింది. దీంతో ఎక్కడకు వెళ్లినా ఆమెను పింకీ అనే పిలుస్తుంటారు. అయితే సుదీప పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన సుదీప కళాకారుల కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె తాత కిలాడీ సత్యం ప్రముఖ నృత్య కళాకారుడు. సినిమాల్లో కూడా ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. సుదీప తొలిసారిగా 1994లో మోహన్‌బాబు నటించిన ఎం.ధర్మరాజు ఎంఏ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.

ఈ సినిమాలో హీరోయిన్ రంభ చెల్లెలి పాత్రను సుదీప పోషించింది. తాతయ్య కిలాడీ సత్యం వల్ల ఐదేళ్ల వయసులోనే సుదీపను ఈ అవకాశం వరించింది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీ షూటింగ్ రాజమండ్రి పరిసరాల్లో జరుగుతుండగా ఆ సమయంలో ఓ చిన్నారి పాత్ర అవసరం పడింది. దీంతో దర్శకుడు సుదీపకు ఆ అవకాశాన్ని కల్పించారు. ఆ తర్వాత అల్లుడుగారు వచ్చారు, మా అన్నయ్య లాంటి సినిమాల్లో కూడా సుదీప నటించింది. అయితే నువ్వు నాకు నచ్చావ్ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ మూవీ తర్వాత బొమ్మరిల్లు, స్టాలిన్, బిందాస్, మిస్టర్ పర్‌ఫెక్ట్, లెజెండ్ వంటి సినిమాల్లోనూ నటించింది. అనంతరం పలు సీరియళ్లలోనూ నటించింది. తర్వాత నటనకు ఫుల్‌స్టాప్ పెట్టి ఆమె ఎంబీఏ చదువుకుంది. చదువు పూర్తి కాగానే శ్రీరంగనాథన్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను వివాహం చేసుకుని ఆమె హైదరాబాద్‌లో సెటిలైంది.