పవర్‌స్టార్‌తో దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమాపై అధికారిక ప్రకటన

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. రాజకీయ విరామం తర్వాత వరుసగా సినిమాలను చేస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాడు. అజ్ఞాత వాసి మూవీ తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకున్న పవన్.. ఈ ఏడాది వకీల్ సాబ్‌తో మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఆ తర్వాత భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు సినిమాలతో పాటు హరీష్ శంకర్‌తోనూ ఓ మూవీ చేస్తున్నాడు. ఇప్పుడు మరో సినిమాను కూడా అధికారికంగా ప్రకటించేశాడు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తన 29వ సినిమాను పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేపథ్యంలో ఈరోజు చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.

ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానరుపై రామ్ తాళ్లూరి పవన్-సురేందర్‌రెడ్డి సినిమాను నిర్మించనున్నారు. స్టార్ రైటర్ వక్కంతం వంశీ ఈ మూవీకి కథను అందిస్తున్నాడు. ఈ మేరకు చిత్ర యూనిట్ ప్రొడక్షన్ నంబర్ 9తో ఓ పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ‘యథా కాలం… తథా వ్యవహారం’ అంటూ రాసుకొచ్చారు. అంతే కాదు ఈ పోస్టర్‌లో హైటెక్ సిటీతో పాటు గన్ కూడా కనిపిస్తోంది. అంటే ఈ సినిమా క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కనుందని తెలుస్తోంది. కాగా సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ కాంబినేషన్‌లో గతంలో కిక్, రేసుగుర్రం వంటి హిట్ సినిమాలు వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి. ఈ సినిమాకు కూడా పవర్ స్టార్ ఇమేజీకి తగ్గట్టుగా వంశీ ఓ కథ సిద్ధం చేశారట. ఈ సినిమా కథ గురించి.. ఇతర తారాగణం, టెక్నికల్ సిబ్బంది గురించి తెలియాల్సి ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా భీమ్లానాయక్ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సాంగ్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. జానపద స్టైల్లో నడిచిన ఈ పాట పవన్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా ఎస్.తమన్ స్వరాలను అందించాడు.