మెగాస్టార్ చిరంజీవిపై తనకున్న ప్రేమను చాటి చెప్పిన యంగ్ హీరో కార్తీకేయ

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో గుమ్మకొండ కార్తికేయ భిన్నమైన సినిమాలను చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత గుణ 369, హిప్పీ, 90ML, చావుకబురు చల్లగా వంటి సినిమాల్లో కార్తీకేయ నటించాడు. ఆయా సినిమాలు మంచి ఫలితాలు సాధించకపోయినా అతడు తన టాలెంట్ ద్వారా పలు అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. ఈ హీరో ప్రస్తుతం ‘రాజావిక్రమార్క’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్‌తో గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించగా ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ద్వారా శ్రీసిరిపల్లి అనే నూతన దర్శకుడు వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ఈ మూవీ టీజర్‌ను శనివారం నాడు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో మీడియా సమక్షంలో విడుదల చేశారు. మెగా హీరో వరుణ్‌తేజ్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు.

ఈ టీజర్ విడుదల కార్యక్రమంలో హీరో కార్తీకేయ మాట్లాడుతూ తనకు మెగాస్టార్ చిరంజీవి మీద ఎంత ప్రేమ ఉందో చాటి చెప్పాడు. తన సినిమాకు మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్ పెట్టుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని కార్తీకేయ తెలిపాడు. తాను చిరంజీవికి ఎంత పెద్ద ఫ్యాన్ అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నాడు. తనకు చిరంజీవి గారంటే ఎంత ప్రేమో అందరికీ తెలిసిన విషయమన్నాడు. చిరంజీవి ఫ్యామిలీ నుంచి వచ్చిన మెగా హీరో వరుణ్ తేజ్ చేతుల మీదుగా టీజర్ రిలీజ్ కావడం సంతోషంగా ఉందన్నాడు. తన తొలి సినిమా ఆర్‌ఎక్స్ 100 సినిమా ట్రైలర్ రామానాయుడు స్టూడియోస్‌లో జరిగిందని కార్తీకేయ గుర్తుచేసుకున్నాడు. అప్పుడు కలిగిన ఎమోషన్స్, ఫీలింగ్స్ ఇప్పుడు తనలో కలుగుతున్నాయని చెప్పాడు. అయితే ఆ సినిమా ట్రైలర్‌కు, ఈ సినిమా టీజర్‌కు ఎలాంటి పోలిక ఉండదన్నాడు. ఆర్‌ఎక్స్ 100 తర్వాత ఈ సినిమా కథ విన్నానని… కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా చేయడం ఆలస్యమైందన్నాడు. ఈ సినిమాను తీయడానికి జరిగిన కథను ఓ బయోపిక్ తీయవచ్చని కార్తీకేయ తెలిపాడు. ఈ సినిమా ప్రారంభం కావడానికి చాలా సమస్యలు ఏర్పడ్డాయని.. ఆ సమయంలో ఆదిరెడ్డి, రామారెడ్డి ముందుకు వచ్చి సినిమా చేసినందుకు ధన్యవాదాలు అంటూ పేర్కొన్నాడు. ఆల్రెడీ టీజర్ రెస్పాన్స్ బావుందన్నాడు.

మరోవైపు తాను వ్యక్తిగత జీవితంలో ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నానని కార్తీకేయ ఈ టీజర్ ఆవిష్కరణ కార్యక్రమంలో చెప్పాడు. తాను బ్యాచిలర్‌గా చేసిన లాస్ట్ సినిమా రాజావిక్రమార్క అని తెలిపాడు. ఈ మూవీతో తాను మంచి హిట్ కొట్టి జీవితంలో నెక్స్ట్ స్టెప్ వేస్తే చాలా బావుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. తప్పకుండా ఈ మూవీతో హిట్ కొడతామని తనకు తెలుసు అని పేర్కొన్నాడు. కాగా ఈ టీజర్ చాలా డిఫరెంట్‌గా ఉందని పలువురు సినీ విశ్లేషకులు ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు. ఈ టీజర్‌లో కార్తీకేయ ఎక్కువగా తుపాకులతో కనిపించాడు. అంతేకాకుండా ఈ టీజర్‌లో కామెడీ కూడా ఉండటంతో ఆకట్టుకుంటోంది. పాపులర్ హిందీ పాట ఏక్ లడ్కీ భీగీ భాగిసీ‌తో టీజర్ ప్రారంభమై కామెడీ, ఫన్‌, ఎమోషనల్ కంటెంట్‌తో ముగిసింది. తనికెళ్ల భరణి, కార్తీకేయ మధ్య సీన్లు చాలా ఆసక్తికరంగా కనిపించాయి. ఎన్ఐఏ అధికారిగా కార్తీకేయ బాడీ లాంగ్వేజ్ సరికొత్తగా ఉంది. చిన్నపుడు కృష్ణను, ఆ తర్వాత టామ్ క్రూజ్‌ను చూసి ఉద్యోగంలో చేరాను. ఇప్పుడు సరదా తీరిపోతుందంటూ కార్తీకేయ ఇచ్చిన పంచ్ బాగుంది. ఈ సినిమాలో సాయి కుమార్, తనికెళ్ళ భరణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్య రవిచంద్రన్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. రాజావిక్రమార్క మూవీని శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానరుపై రామారెడ్డి నిర్మిస్తున్నారు.