పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులకు వరుసగా ట్రీట్లు అందుతున్నాయి. ఇప్పటికే భీమ్లా నాయక్ సినిమా నుంచి టైటిల్ సాంగ్ రాగా సోషల్ మీడియాను పాట ఊపేస్తోంది. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 29న విడుదలవుతుందని మేకర్స్ ప్ర్టకటించారు. రిలీజ్ డేట్ పోస్టర్లో పవన్ ఓ యోధుడి గెటప్‌లో కనిపిస్తున్నాడు. అంటే మూడు నెలల గ్యాప్‌లో పవర్ స్టార్ నటించిన రెండు సినిమాలు అభిమానులను పలకరించనున్నాయి. జనవరి 12, 2022న భీమ్లా నాయక్ విడుదల కానుండగా, సినిమా రిలీజైన మూడు నెలలకు హరిహర వీరమల్లు చిత్రం థియేటర్స్‌లోకి రానుంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే మోషన్ పోస్టర్ విడుదల చేశారు. దీనికి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.
హరిహర వీరమల్లు సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం అందిస్తుండగా.. ఈ మూవీని ప్రఖ్యాత నిర్మాత ఏఎమ్ రత్నం తన బ్యానరుపై సమర్పిస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఖుషి వంటి బ్లాక్ బస్టర్ హిట్‌ను అభిమానులకు ఏఎమ్ రత్నం అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ రిపీట్ అవుతోంది. మెగా సూర్యా ప్రొడక్షన్స్ బ్యానరుపై ఈ సినిమాను ఎం.దయాకర్‌రావు నిర్మిస్తున్నారు. పవన్ కెరీర్లోనే ఈ మూవీ భారీ బడ్జెట్‌తో నిర్మితం కానుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం కోట్ల రూపాయల ఖర్చుతో భారీ సెట్లు వేయించారు. ఈ మూవీలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన తొలిసారిగా నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. మరో హీరోయిన్గా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. ఈ చిత్రానికి అగ్రశ్రేణి సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి సంగీత బాణీలు అందిస్తున్నారు. మరోవైపు ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా ఈ చిత్రానికి సంభాషణలు సమకూరుస్తున్నారు. అలా దిగ్గజాలందరూ కలిసి ఓ పీరియాడికల్ మూవీని పవర్ స్టార్ చేతుల మీదుగా ప్రేక్షకులకు కన్నులవిందును అందించబోతున్నారు.