మెగా అభిమానులు రెడీగా ఉండండి.. సాయితేజ్ సినిమాలో మాస్ సాంగ్ వచ్చేస్తోంది

మెగా కాంపౌండ్ హీరోలలో సాయిధరమ్ తేజ్ తన టాలెంట్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రేయ్ సినిమాతో వెండితెర తెరంగేట్రం చేశాడు. అయితే ఆ సినిమా ఆర్థికంగా చిక్కుల్లో పడటంతో పిల్లా నువ్వు లేని జీవితం అంటూ తొలి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో వరుసగా అవకాశాలను ఒడిసి పట్టుకున్నాడు. తొలి సక్సెస్ ఇచ్చిన దిల్ రాజు బ్యానర్‌లోనే సుప్రీమ్, సుబ్రమణ్యం ఫర్ సేల్ అంటూ బ్యాక్ టు బ్యాక్ హిట్లు సాధించాడు. ఒకవైపు నటనతో మరోవైపు డ్యాన్సులతో మెగా హీరోగా తనకంటూ అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించాడు. సుబ్రమణ్యం ఫర్ సేల్ తర్వాత వరుసగా ఫ్లాపులు పలకరించినా నిరాశపడకుండా చిత్రలహరి సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. తిరుమల కిషోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ప్రతిరోజూ పండగే సినిమాతోనూ హిట్ కొట్టాడు. ఆ తర్వాత కరోనా విజృంభిస్తున్న సమయంలో సోలో బతుకే సో బెటర్ సినిమాతోనూ తెలుగు సినిమా పరిశ్రమకు విజయాన్ని అందించాడు.

ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ మావయ్యలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ బాటలోనే నడుస్తూ వరుస సినిమాలను చేసుకుంటూ వెళ్తున్నాడు. కథల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూనే ఆచితూచి సినిమాలను ఎంచుకుంటున్నాడు. దీంతో దేవ్ కట్టా దర్శకత్వంలో రిపబ్లిక్ అనే సినిమాను చేస్తున్నాడు. పొలిటికల్ కథాంశంతో రూపొందుతున్న ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ అడ్డుపడింది. దీంతో షూటింగ్ లేట్ కావడంతో ఇప్పుడు అక్టోబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రిపబ్లిక్ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్లు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీ నుంచి తొలిపాటగా విడుదలైన గానా ఆఫ్ రిపబ్లిక్ అనే పాట కూడా అందరినీ అలరించింది. ఇప్పుడు రెండో పాటకు చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ పాటకు సంబంధించిన అప్‌డేట్‌ను తేజూ వెరైటీగా ఇచ్చాడు. కమెడియన్ వెన్నెల కిషోర్‌ ఫోన్‌లో మాటలు చెప్తుండగా కారు డ్రైవ్ చేస్తూ ఈ పాటకు సంబంధించి వివరాలను తేజూ పంచుకున్నాడు.

ఈ మేరకు సాయి తేజ్ కారులో పాటలు వింటూ ప్రయాణిస్తుండగా.. ఒక్కసారిగా మ్యూజిక్ సిస్టమ్ మాట్లాడుతుంది. ఆ సిస్టమ్ నుంచి వెన్నెల కిషోర్ వాయిస్ వినిపిస్తుంది. ఎంత పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్‌గా ఉంటే మాత్రం అన్ని సినిమాల్లో లవ్ సాంగ్స్ మాత్రమే చేయాలా అని వెన్నెల కిషోర్ అడుగుతాడు. అప్పుడెప్పుడో పిల్లా నువ్వులేని జీవితం సినిమాలో డాన్స్‌లతో ఆకట్టుకున్న తేజ్ ఇప్పుడు ఎందుకు డాన్స్ వేయడం లేదంటూ వెన్నెల కిషోర్ ప్రశ్నిస్తాడు. సుప్రీమ్, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాల్లో డ్యాన్సులతో ఇరదీసిన తేజ్ ఇటీవల విడుదలైన చిత్రలహరి, ప్రతిరోజూ పండగే వంటి సినిమాల్లో మాస్ సాంగ్స్ ఎందుకు చేయలేదని వెన్నెల కిషోర్ అడుగుతాడు. దానికి తేజూ స్పందిస్తూ.. ఆయా సినిమాల కథలు డిమాండ్ చేయడంతో మాస్ సాంగ్స్ పడలేదని.. దాంతో డాన్స్‌కు అవకాశం లేకుండా పోయింది చెప్తాడు. అయితే రిపబ్లిక్ సినిమాలో పంజా అభిరామ్‌గా నటిస్తుండటంతో మాస్ విన్నాలన్న తన కోరిక మళ్లీ నెరవేరేలా కనిపించడంలేదని వెన్నెల కిషోర్ నిరాశను వ్యక్తం చేస్తాడు. అయితే రిపబ్లిక్ సినిమాలో మంచి మాస్ సాంగ్ ఉందంటూ సాయితేజ్ చెప్తాడు. ఈసారి మ్యూజిక్ సిస్టమ్ మారుమ్రోగిపోయే జాతర సాంగ్ ఉందంటూ హింట్ ఇచ్చాడు. మణిశర్మ సంగీత సారథ్యంలో జోర్ సే అంటూ సాగే ఈ జాతర పాటను సెప్టెంబర్ 6న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు రిపబ్లిక్ మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీలో ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.