యాంకర్ విష్ణుప్రియతో తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన హీరో నవదీప్

టాలీవుడ్‌లో యంగ్ హీరోల్లో నవదీప్ ఒకడు. అతడి కెరీర్ ఆశించిన విధంగా లేకపోయినా తన నటనతో పలు సినిమాల్లో నవదీప్ అవకాశాలను అందుకుంటూ ప్రేక్షకులను అలరింపచేస్తున్నాడు. హీరోగా 15 సినిమాల్లో నటించినా కేవలం గౌతమ్ ఎస్ఎస్‌సీ సినిమా మాత్రమే అతడికి విజయం సాధించిపెట్టింది. దీంతో కేవలం హీరో రోల్స్ మాత్రమే కాకుండా సపోర్టింగ్ ఆర్టిస్టుగా నవదీప్ నటిస్తూ రాణిస్తున్నాడు. అయితే కొంతకాలంగా నవదీప్ గురించి సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ప్రముఖ యాంకర్ విష్ణుప్రియతో హీరో నవదీప్ పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని.. దీంతో త్వరలో ఆమెను పెళ్లి చేసుకుంటున్నాడని టాక్ నడుస్తోంది. అంతేకాకుండా ఇటీవల ఈటీవీలో సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ ప్రోగ్రామ్‌లో యాంకర్ విష్ణుప్రియ పాల్గొంది. ఈ సందర్భంగా హీరోలు నవదీప్, రానాలలో ఒకరితో యాంకరింగ్ చేయమంటే ఎవరితో చేస్తావు అని విష్ణుప్రియను సుమ ప్రశ్న వేసింది.

వెంటనే విష్ణుప్రియ ఈ ప్రశ్నకు సమాధానంగా తనకు నవదీప్ అంటే ఇష్టమని చెప్తూ అతడికి ఐలవ్‌యూ అని చెప్పేసింది. దీంతో పక్కనే ఉన్న శ్రీముఖి, యాంకర్ సుమతో పాటు అందరూ అవాక్కయ్యారు. అంతేకాకుండా శ్రీముఖి కలగజేసుకుని విష్ణుప్రియ, నవదీప్ కలిసి చాలాసార్లు డిన్నర్లకు వెళ్లేవారని మరో సీక్రెట్‌ను బయటపెట్టింది. అయితే సుమ ఈ టాపిక్‌ను చాలా తెలివిగా డైవర్ట్ చేసేసింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం నవదీప్, విష్ణుప్రియ జంట గురించి హాట్ కామెంట్లు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ కామెంట్లపై హీరో నవదీప్ స్పందించాడు. యాంకర్ విష్ణుప్రియ, తాను కేవలం మంచి స్నేహితులం అని చెప్పాడు. అంతకుమించి తమ మధ్య ఎలాంటి రిలేషన్‌షిప్ లేదని స్పష్టం చేశాడు. దయచేసి తమ మధ్య లేనిపోని లింకులు పెట్టవద్దని నెటిజన్‌లకు హితవు పలికాడు. అసలే తాను జీవితంలో పెళ్లి చేసుకోకూడదనే నిర్ణయానికి వచ్చానని, జీవితాంతం ఒంటరి జీవితం బతకాలని భావిస్తున్నానని తెలిపాడు. అందువల్ల దయచేసి ఇలాంటి లింకులు పెట్టవద్దని కోరాడు. గతంలో కూడా విష్ణుప్రియతో తాను డేటింగ్‌లో ఉన్నానని వార్తలు వచ్చాయని, అప్పుడు కూడా తాను క్లారిటీ ఇచ్చానని గుర్తు చేశాడు. కాగా మరి వీళ్లిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ లేకపోతే విష్ణుప్రియ నవదీప్‌కు ఎందుకు ఐలవ్‌యూ చెప్పింది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.