రోజా, ఇంద్రజ మధ్య మాటల యుద్ధం.. ఇద్దరూ మాములుగా తిట్టుకోలేదు

జబర్దస్త్ కార్యక్రమానికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హాయిగా నవ్వుకోవడానికి ప్రతి ఒక్కరూ ఈ షోను చూస్తారు. ఒకవేళ టీవీలో చూడటం మిస్ అయితే యూట్యూబ్ పెట్టుకుని మరీ చూస్తారు. అలాంటి జబర్దస్త్ కార్యక్రమానికి ఒకప్పుడు మెగా బ్రదర్ నాగబాబు, రోజా జడ్జిగా వ్యహరించేవారు. అనంతరం నాగబాబు ఈ షో నుంచి తప్పుకోగా.. రోజా కూడా కొన్నాళ్లు ఈ షోలో పాల్గొనలేదు. అయితే వ్యక్తిగత కారణాలు, అనారోగ్య సమస్యలతో కొన్నాళ్లు రోజా దూరం కావడంతో.. ఈ షోకు జడ్జిగా నటి ఇంద్రజ వ్యవహరించింది. రోజా లేని లోటును ఇంద్రజ పూడ్చటమే కాకుండా తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుని రోజాకు మించి అన్నంత పేరు తెచ్చుకుంది. దీంతో రోజా బదులు ఇంద్రజనే జడ్జిగా కొనసాగించాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి. అయితే జబర్దస్త్ నిర్వాహకులు మాత్రం రోజా వైపే మొగ్గు చూపించారు. రోజా కమ్ బ్యాక్ ఇవ్వడంతో ఇంద్రజ సైడ్ కాక తప్పలేదు.

అయితే డిమాండ్ ప్రకారం జబర్దస్త్ నిర్వాహకులు మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు మాత్రం తాము నిర్వహిస్తున్న మరో షోకు ఇంద్రజను జడ్జిగా తీసుకున్నారు. అందులో తన మాయాజాలాన్ని ప్రదర్శిస్తూ ఇంద్రజ బుల్లితెర అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా మల్లెమాల వారు వినాయకచవితి సందర్భంగా ఊరిలో వినాయకుడు అనే షోను ఏర్పాటు చేశారు. ఈ షోలో రోజా, ఇంద్రజ ఇద్దరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లడ్డూ వేలం నిర్వహించగా రోజా, ఇంద్రజ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. వేలం పాట అంటే జబర్దస్త్‌లో జడ్జిమెంట్ అనుకున్నారా అని ఇంద్రజ అనగానే.. రోజా మీరు శ్రీదేవి డ్రామా కంపెనీలో జడ్జిమెంట్ అనుకుంటున్నారా అంటూ కౌంటర్ ఇస్తుంది. అనంతరం వరుస కౌంటర్లతో ఇంద్రజ రెచ్చిపోయింది. రోజా గారూ మీరు ఈ లడ్డూ కొనగలరా అని ఇంద్రజ అనగానే.. ఎంతైనా కొంటా.. ఎంత ఇచ్చయినా కొంటా అని రోజా బదులు ఇస్తుంది. అబ్బో ఇదేమైనా శుభలగ్నం సినిమాలో డబ్బులిచ్చి జగపతిబాబును కొనడంలా అనుకోకండి అంటూ ఇంద్రజ పెదవి విరుస్తుంది. దీంతో అక్కడున్న వాళ్లందరూ పెద్దగా నవ్వుతారు. దీంతో నన్ను చూసి ఏడవకు అంటూ రోజా అంటే.. ఎక్కువగా మాట్లాడుతున్నారు.. అతి వేగం ఆరోగ్యానికి మంచిది కాదు అని ఇంద్రజ వార్నింగ్ ఇస్తుంది. అయితే ఇది ఓ స్కిట్‌లో భాగమని తెలుస్తోంది. ఈ స్కిట్ వినాయకచవితి పండగ రోజు ఈటీవీలో ప్రసారం కానుంది.