హీరోయిన్ శ్రుతిహాసన్‌‌కు‌ త్వరలోనే పెళ్లి.. తనకు అతడే పర్‌ఫెక్ట్ అంటున్న శ్రుతి

హీరోయిన్ శ్రుతిహాసన్ ప్రముఖ నటుడు కమల్‌హాసన్ కుమార్తె అన్న విషయం అందరికీ తెలిసిందే. సంగీత దర్శకురాలిగా తన కెరీర్‌ను మొదలుపెట్టిన శ్రుతిహాసన్ తర్వాత నటన మీద దృష్టిపెట్టింది. దీంతో తమిళం, తెలుగు, హిందీ సినిమాల్లో హీరోయిన్‌గా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. మొదట్లో ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ కావడంతో శ్రుతిని అందరూ ఐరన్ లెగ్ హీరోయిన్ అని భావించేవారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో శ్రుతిహాసన్ దశే మారిపోయింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో అందరూ శ్రుతి వైపే చూశారు. టాలెంట్ లేదని విమర్శించిన వారే శ్రుతి డేట్ల కోసం బారులు తీరారు. అలా టాలీవుడ్‌లో వరుస ఆఫర్లను దక్కించుకున్న ఆమెకు ఓ లవ్‌స్టోరీ కూడా ఉంది. లండన్‌కు చెందిన మైఖేల్‌ కోర్సెల్‌తో శ్రుతిహాసన్‌ చాలా కాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. అయితే తర్వాత వారిద్దరికీ బ్రేకప్ అయ్యింది.

ప్రస్తుతం డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో శ్రుతిహాసన్ ప్రేమాయణం నడుపుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. శాంతను హజారికతో శ్రుతిహాసన్ చాలాసార్లు డిన్నర్ పార్టీలలో కెమెరాలకు కనిపించింది కూడా. దీంతో వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కామెంట్లు వినిపించాయి. దానికి తోడు ప్రస్తుతం శ్రుతిహాసన్ శాంతనుతో కలిసి జీవిస్తుండటం, అతడితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండటంతో ఈ కామెంట్లకు బలం చేకూరింది. ఈ నేపథ్యంలో తన పెళ్లిపై వస్తున్న వార్తలపై స్వయంగా శ్రుతిహాసన్ స్పందించింది. శాంతను హజారికతో తనకు ఉన్న రిలేషన్ షిప్ గురించి క్లారిటీ ఇచ్చింది. శాంతను తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పింది. సంగీతం, కళల పట్ల శాంతనుకు మంచి అవగాహన ఉందని, తమ ఇద్దరి అభిరుచులు ఒకటేనని.. అందుకే అతనితో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతానని చెప్పుకొచ్చింది. అంతేకాదు శాంతనుపై తనకు ఎంతో గౌరవం కూడా ఉందని శ్రుతిహాసన్ పేర్కొంది. ఇప్పటి వరకు తన పెళ్లి విషయంలో ఎలాంటి సీక్రెట్స్ లేవని, తాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడే ఆ వివరాలను మీడియాకు వెల్లడిస్తానని తెలిపింది. కానీ ప్రస్తుతానికి తనకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని శ్రుతి స్పష్టం చేసింది.