బిగ్ బాస్ -1 టైటిల్ విజేత సినీ నటుడు అయిన శివబాలాజీ గారు క్లాసుల పేరుతో కార్పోరేట్, ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆయన చేస్తున్న పోరాటం అందరికీ తెలిసిందే. ఎలాంటి నోటీస్, సమాచారం లేకుండా ఆన్లైన్ క్లాసుల నుంచి తమ పిల్లలను తొలగించారనే ఆవేదనతో మణికొండలోని మౌంట్ లీటేరా జీ స్కూల్‌పై శివబాలాజీ మానవ హక్కుల సంఘం (HRC)కి ఫిర్యాదు చేశారు.

ఈ కథనం మేరకు దీనిపై దర్యాప్తు చేపట్టాలని సంబంధిత అధికారులను హెచ్ఆర్సీ ఆదేశించింది. దీంతో ఆ స్కూల్ వివరణ ఇచ్చుకుంది. కానీ, ఆ వివరణ శివబాలాజీకి కరెక్ట్ అనిపించలేదు. దీంతో ఆయన ఈరోజు రంగారెడ్డి డీఈవోను కలిసి ఫిర్యాదు చేశారు.

తన భార్య మధుమితతో కలిసి డీఈవో కార్యాలయానికి వెళ్లిన శివబాలాజీ.. ప్రైవేటు స్కూళ్ల నుంచి విద్యార్థుల తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను డీఈవో విజయలక్ష్మికి గారికి వివరించారు. తరువాత డీఈవో కార్యాలయం ఆవరణలో శివబాలాజీ భార్య మధుమితతో కలిసి మీడియాతో మాట్లాడారు. తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, తమకు డీఈవో కూడా సహకరిస్తారని చెప్పారని శివబాలాజీ చెప్పారు. తమ పట్ల మౌంట్ లీటేరా జీ స్కూల్ యాజమాన్యం వ్యవహరించిన విధానాన్ని తెలియజేశారు.

‘‘మాది పబ్లిసిటీ డ్రామా అంట. మీడియా డ్రామా అంట. మేము డ్రామా చేస్తున్నామని వాళ్లు ఒప్పుకున్నారంటే.. మరి దీనికి ప్రొడ్యూసర్లు, స్క్రిప్ట్ రైటర్లు వాళ్లా? ఎందుకంటే వాళ్లు అలా చేశారు కాబట్టే మేం ఇలా బయటికి వచ్చాం. ఒక ఆర్గనైజేషన్ ఇలా మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్. నేను ఒక పేరెంట్ కాదు.. ఒక క్లైంట్‌గా 8 సంవత్సరాలు వాళ్లకి బిజినెస్ ఇచ్చాను. నా గురించి ఇలా మాట్లాడతారా? మిగిలిన తల్లిదండ్రులను ఇలా మిస్ గైడ్ చేస్తారా? ఏం ఆర్గనైజేషన్ మీది. నిజంగా చాలా బాధేసింది’’ అని శివబాలాజీ అన్నారు.
